3, మార్చి 2016, గురువారం

మహా శివరాత్రి వృత్తాంతం

మహా శివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి